జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

-కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
-కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
-ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం – సిబ్బంది, ఏజెంట్లు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం జగ్గయ్యపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికల సిబ్బందికి కల్పించిన ఏర్పాట్లు, బ్యాలెట్ ప్రక్రియ నిర్వహణ తీరును తనిఖీ చేసి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ఎస్.జి.ఎస్. కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. కౌంటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, కౌంటర్లు, బారికేడ్లు, సిబ్బంది విధుల నిర్వహణకు కేటాయించిన ప్రదేశాలు, కౌంటింగ్ ఏజెంట్లకు కల్పించిన సీటింగ్ ఏర్పాట్లు, వారి రాకపోకలకు నిర్దేశించిన మార్గాలను పరిశీలించారు.
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు నిర్దేశించిన ప్రదేశాలను స్పష్టంగా కేటాయించాలని, కౌంటింగ్ హాల్‌లో క్రమశిక్షణ, సమన్వయం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. జిల్లా పరిధిలోని 3 డివిజన్లు, 16 మండలాల పరిధిలో మొత్తం 16 జడ్పీటీసీ స్థానాలు, 276 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మూడు నుంచి నాలుగు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ నగరంలో కూడా కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పటిష్టమైన శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ తరఫున సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్, ఆర్డీవోలు, ఏసీపీలు, డీఎస్పీలు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 6:30 గంటల నుంచి 7 గంటల మధ్య తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. తొలుత బ్యాలెట్ పేపర్లను నిబంధనల ప్రకారం వర్గీకరించిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏకకాలంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలు, నిర్దేశిత విధివిధానాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.

వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున నియమితులైన కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటల కల్లా సంబంధిత కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. తదుపరి రౌండ్లలో విధులు నిర్వహించాల్సిన ఏజెంట్లు కూడా ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకుని సిద్ధంగా ఉండాలని తెలిపారు.
కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు తమకు కేటాయించిన స్థానాల్లోనే ఉండాలని, ఎన్నికల అధికారుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్దేశించిన ప్రాంతం నుంచి మాత్రమే మీడియా కవరేజీకి అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ హాల్‌లో దృశ్యాల చిత్రీకరణకు నిర్దేశిత దూరం నుంచి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను మీడియా ప్రతినిధులు పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కోరారు.

ఈ తనిఖీల్లో నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.