-శనివారం నాటికి 100 శాతం విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యం
-రెండు తుపానులతో విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకుపైగా నష్టం
-మురసు తుపానుతో 7,500కు పైగా స్తంభాలు నేలకూలాయి
-మూడు రాష్ట్రాల నుంచి 3 వేల మందికిపైగా సిబ్బంది సేవలు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్, మురసు తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ప్రతి రైతు, ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శనివారం సాయంత్రానికి 100 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు తుపాన్ల కారణంగా విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
మంత్రి శుక్రవారం అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి తుపాను నష్టాన్ని పరిశీలించారు. జె.పంగులూరు మండలంలోని ముప్పవరం, కొండమంజులూరు, కోటపాడు, జనకవరం, తూర్పు తక్కెళ్లపాడు, అలవలపాడు గ్రామాలతో పాటు కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు, కొరిశపాడు, గ్రామాలను సందర్శించారు. అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు.
ముప్పవరంలో దెబ్బతిన్న మామిడి తోటలను, కొండమంజులూరులో ధ్వంసమైన నర్సరీని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కోటపాడులో కూలిన ఇళ్లు, పశువుల కొట్టాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. తూర్పు తక్కెళ్లపాడులో పొలాల్లో పడిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, దెబ్బతిన్న విద్యుత్ లైన్లను చూశారు. తుపాను నష్టంపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.
పొగాకు సహా పలు పంటలకు నష్టం
తుపాను ప్రభావంతో మొక్కజొన్న, అరటి, బొప్పాయి, ఉసిరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పొగాకు పంటకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు బ్యార్నీలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతుల సమక్షంలోనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నష్టాన్ని నమోదు చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా పారదర్శకంగా అంచనాలు రూపొందించాలని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం
అర్నబ్ తుపాను సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, మురసు తుపాను సమయంలో 120 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీచాయని మంత్రి వివరించారు. దీంతో విద్యుత్ లైన్లు, కండక్టర్లు తెగిపోవడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. మురసు తుపాను కారణంగానే 7,500కుపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయని చెప్పారు. ఇళ్లు, పంటలు, ఇతర ఆస్తులకు కూడా భారీగా నష్టం వాటిల్లిందన్నారు.
శనివారం నాటికి పూర్తిస్థాయిలో సరఫరా
విద్యుత్ పునరుద్ధరణ పనులను ప్రాధాన్య క్రమంలో చేపడుతున్నట్లు గొట్టిపాటి తెలిపారు. గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు గురువారం సాయంత్రానికే పూర్తిస్థాయిలో సరఫరా పునరుద్ధరించామన్నారు. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. వర్షాలు తగ్గినప్పటి నుంచి విద్యుత్ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారని, అప్పటికి 70 శాతం సరఫరాను పునరుద్ధరించినట్లు వివరించారు. ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, అద్దంకి పట్టణాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయిందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ముందుగా గృహ వినియోగదారులకు సరఫరా అందించి, ఆ తర్వాత వ్యవసాయ, ఆక్వా రంగాలకు పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రానికి తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటికీ విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మూడు రాష్ట్రాల నుంచి 3 వేల మందికిపైగా సిబ్బంది
విద్యుత్ పునరుద్ధరణకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి మూడు వేల మందికిపైగా సిబ్బంది వచ్చి సేవలందిస్తున్నారని మంత్రి తెలిపారు. సంతనూతలపాడు మండలం నిడమానూరులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలవలపాడులో స్తంభాలను తిరిగి నిలబెట్టే పనుల్లో ఉన్న కర్ణాటకలోని బళ్లారి సిబ్బందితో, నిడమానూరు వద్ద పనిచేస్తున్న తమిళనాడు సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పునరుద్ధరణ పనుల్లో ఉన్న సిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సిబ్బందిని రప్పించారని తెలిపారు. విపత్కర సమయంలో సహకరించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రెండు రోజుల్లో సమగ్ర నష్టం నివేదిక
అర్నబ్, మురసు తుపాన్ల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు మంత్రి తెలిపారు. పంటలు, ఆస్తులు, విద్యుత్ వ్యవస్థతో పాటు ఇతర రంగాలకు జరిగిన నష్టంపై మరో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం, సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
