హింస రాజకీయాలే గొడ్డలి పార్టీ దినచర్య

-స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు, దాడులకు పాల్పడుతున్న వైసీపీ
-ఎన్నికలు జరగకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయే ప్రమాదం
-పక్క రాష్ట్రాల నుంచి కిరాయి గూండాలను రప్పించి ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు కుట్రలు
-సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం
-స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.12,500 కోట్ల భారీ నిధులు శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి విధ్వంసం చేస్తే, సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూపాయి రూపాయి పోగేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఋషులు యజ్ఞం చేస్తుంటే, రాక్షస మూకలు భగ్నం చేయాలని చూసినట్లు, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కోర్టుల్లో కేసులు వేసి కుట్రలు పన్నిందని, అవి ఫలించకపోవడంతో నేడు నేరుగా హింసకు తెరలేపిందని మండిపడ్డారు.

ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి కిరాయి రౌడీలు, షార్ప్ షూటర్లను రప్పించి పుంగనూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి అండతో చిత్తూరులో నడవలేని స్థితిలో వాకర్ సాయంతో నామినేషన్ వేయడానికి వచ్చిన వృద్ధ మహిళా అభ్యర్థిపై సైతం దాడి చేసి పత్రాలు లాక్కోవడం గొడ్డలి పార్టీ రాక్షసత్వానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ సుప్రీంకోర్టు, ఈసీల వద్ద గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతల మాటలకు, క్షేత్రస్థాయి గణాంకాలకు అసలు పొంతన ఉందా అని నిలదీశారు. 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకంగా 23 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని, సీఎం సొంత నియోజకవర్గం కుప్పం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని గుర్తుచేశారు.

నామినేషన్ల గణాంకాలను పట్టాభిరామ్ స్వయంగా మీడియా ముందుంచారు. ఎంపీటీసీ మొదటి రోజు మొత్తం 9,829 స్థానాలకు 5,267 నామినేషన్లు పడితే, అందులో టీడీపీ 2,719, గొడ్డలి పార్టీ తరపున 1,918 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అడ్డుకుంటే తొలిరోజే 1,918 నామినేషన్లు ఎలా వేశారో చెప్పాలన్నారు. 659 జెడ్పీటీసీ స్థానాలకు మొదటి రోజు 409 నామినేషన్లు పడితే టీడీపీ 128 దాఖలు చేయగా, గొడ్డలి పార్టీ తరపున టీడీపీ కంటే 64 ఎక్కువగా 192 నామినేషన్లు ఫైల్ అయ్యాయని స్పష్టం చేశారు. ఇంత భారీగా నామినేషన్లు వేసి కూడా దాడులు చేస్తున్నారంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2020-21 వైసీపీ పాలనలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తూ.. 25 శాతం ఎంపీటీసీలు (2,362 స్థానాలు), 20 శాతం జెడ్పీటీసీలు (126 స్థానాలు) బలవంతపు ఏకగ్రీవాలు చేశారని, తన ప్రాణాలకు రక్షణ కావాలని కోరింది నిజామా కాదా అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. నాడు “ఎన్నికల కమిషన్ ఎందుకు? ప్రభుత్వమే నిర్వహించుకుంటుంది” అన్న జగన్ రెడ్డి, నేడు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల సంఘం మెట్లు ఎక్కుతున్నారని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం వక్రీకరిస్తూ ఎన్నికలు వాయిదా పడ్డాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను పరిశీలించి ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (ఎస్ఎల్‌పీ నెం: 37476/2026) స్పష్టంగా ఆదేశించిందని ఆర్డర్ కాపీని ప్రదర్శించారు. కోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రెండు రోజుల గడువు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా గౌరవిస్తుందని, స్వాగతిస్తుందని తెలిపారు.

సొంత చెల్లి కుమార్తె వివాహాన్ని కూడా ఓర్చుకోలేక తాడేపల్లి గేట్లు మూసేసిన సంకుచిత మనస్తత్వం జగన్‌దని, వేసిన రోడ్లను సైతం తవ్వేసే సైకో పార్టీకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరని తేల్చి చెప్పారు. పోలీసులు అమరవీరుల దినోత్సవం వేళ సీఎం ఆదేశించినట్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తారని హెచ్చరించారు. ‘పీకలు కోస్తాం’ అంటూ బెదిరింపులకు దిగిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వారిపై పార్టీ తరపున ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కట్టాలని పట్టాభిరామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.