-ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం.. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతాం
-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.
రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై విశ్వాసంతో కూటమికి పట్టం కట్టారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఉన్న సమన్వయం, పరస్పర సహకారం కూటమి విజయాలకు ప్రధాన బలమని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో తాగునీటి సమస్యలు, క్వారీ సెంటర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, 22-ఏ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.
పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామికవేత్తలకు పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నగరంలోని స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ.. తాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని, సామాన్య ప్రజలు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డ్వాక్రా సంఘం మహిళగా ప్రజల మధ్య నుంచి వచ్చిన తనకు మహిళలు, పేదల కష్టాలు తెలుసునని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తే పేదల సమస్యల పరిష్కారానికి, మహిళల సంక్షేమానికి, నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
