ఢిల్లీలో విద్యార్థి సంఘ నాయకుల ఆత్మీయ సమావేశం

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నూతనంగా ఎన్నికైన విద్యార్థి సంఘ నాయకుల ఆత్మీయ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుత విద్యావిధానం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక, రాజకీయ అంశాలు, కులగణన ఆవశ్యకతపై చర్చించారు. వెనుకబడిన తరగతులకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలు, విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూరజ్ మండల్, రతన్ లాల్, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు కిరణ్‌కుమార్ గౌడ్, పలువురు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.