మారిస్ స్టెల్లా కళాశాలలో ఘనంగా వరి కోతల పండుగ

-ఇంద్రాణి, మైసూర్ మల్లిగే దేశీయ వరి వంగడాల పంట కోత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మారిస్ స్టెల్లా కళాశాల (అటానమస్), విజయవాడలో వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో వరి కోతల పండుగ (Paddy Harvesting Day)ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన ఇంద్రాణి, మైసూర్ మల్లిగే అనే రెండు దేశీయ వరి వంగడాల పంటను ఈ సందర్భంగా కోత కోశారు.

కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ డా. ఇన్నాసమ్మ గాడే, కరస్పాండెంట్ సిస్టర్ లీనా, వైస్ ప్రిన్సిపాల్స్ సిస్టర్ డా. ఆశా, సిస్టర్ ఉషా, డీన్ పద్మలత తదితరులు వరి కోతలను ప్రారంభించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు వ్యవసాయ విభాగం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను, దేశీయ వరి వంగడాల సాగు, పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డా. పి. లక్ష్మణ స్వామి, అధ్యాపకులు గౌతమి, రవి తేజ, లావణ్య, భావ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. లక్ష్మణ స్వామి మాట్లాడుతూ, కళాశాల వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఇంద్రాణి, మైసూర్ మల్లిగే వరి రకాల నుంచి సేకరించిన విత్తనాలను రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులకు అందించనున్నట్లు తెలిపారు. రైతులకు పంపిణీ చేయడానికి ముందు విత్తనాల మొలకెత్తే శాతాన్ని (Germination Percentage) శాస్త్రీయంగా పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విత్తనాలను మాత్రమే అందజేస్తామని వివరించారు.

దేశీయ వరి వంగడాల పరిరక్షణ, నాణ్యమైన విత్తనోత్పత్తి, రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష వ్యవసాయ అనుభవం లభించడంతో పాటు దేశీయ వరి వంగడాల ప్రాముఖ్యత, విత్తన నాణ్యత, రైతుల అభ్యున్నతిలో కళాశాల వ్యవసాయ విభాగం పోషిస్తున్న పాత్రను చాటిచెప్పారు.