-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ జరిగిన మరుసటి రోజే ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ కోరారు.
ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోలింగ్‌కు ముందు ఏర్పాట్ల నుంచి పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సామగ్రిని అప్పగించే వరకు నిరంతరాయంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. అనేక సందర్భాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా, మరుసటి రోజు తెల్లవారుజాము వరకు విధుల్లో ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల శ్రమను గుర్తించి ప్రభుత్వం 2014 ఏప్రిల్ 25న జారీ చేసిన జీవో నంబర్ 119 ద్వారా ప్రత్యేక సాధారణ సెలవు కల్పించిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2021 ఫిబ్రవరి 20న జారీ చేసిన మెమో ద్వారా కూడా తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలింగ్ మరుసటి రోజు ఇవ్వాల్సిన సెలవును తదుపరి పని దినానికి వాయిదా వేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఉత్తర్వుల అసలు ఉద్దేశం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మరుసటి రోజే ప్రత్యేక సాధారణ సెలవు మంజూరయ్యేలా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సంబంధిత సెలవు మంజూరు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే సంబంధిత ఉద్యోగులకు ఎన్నికల విధుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, సెలవు మంజూరులో ఎలాంటి పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన సెలవు సదుపాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని కె.ఆర్. సూర్యనారాయణ కోరారు.
