-ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి
-పోలింగ్ కేంద్రాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
-ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పర్యవేక్షణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతగా తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి టెంట్లు ఏర్పాటు చేయరాదని, 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లకు పంపిణీ చేసే ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు, పార్టీ చిహ్నాలు ఉండరాదని తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా ధరించాలని, పార్టీ కండువాలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధులకు ఆటంకం కలిగించడం, అధికారులపై కేకలు వేయడం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ ఏజెంట్లపై ప్రిసైడింగ్ అధికారులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారని వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నిశితంగా పరిశీలించేందుకు షాడో రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని, ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐఎన్‌సీ నుంచి బి.మురళీకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పి.హరికృష్ణ, సీపీఎం నుంచి డి.వి.కృష్ణ, వైఎస్సార్సీపీ నుంచి పి.రాజశేఖర్, వి.యశోధర్, టీడీపీ నుంచి బి.అనిల్, బీఎస్పీ నుంచి బి.కిరణ్, జనసేన పార్టీ నుంచి జె.శ్రీనివాస్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
