తుపాను అనంతర వైరల్‌ జ్వరాలుగా అనుమానం

-కురుపాం గురుకుల బాలికల జ్వరాలపై డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నివేదిక
-బాలికల ఆరోగ్యం నిలకడగా ఉంది
-పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి
-వైద్య శిబిరం కొనసాగింపు.. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గురుకుల పాఠశాలలో బాలికలకు జ్వరాలు వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు నివేదించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆర్‌. వెంకటరమణకు అందిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, మొత్తం 71 మంది బాలికలు జ్వరాల బారినపడగా, వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 38 మంది బాలికలు వసతి గృహంలోని ప్రత్యేక గదిలో వైద్య చికిత్స, పర్యవేక్షణలో ఉన్నారు. ముగ్గురు బాలికలను మెరుగైన వైద్య సేవల కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలికలందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఒకరికి మలేరియా పాజిటివ్‌

విద్యాసంస్థలో మొత్తం 559 మంది బాలికలు ఉండగా, 516 మంది హాజరయ్యారు. వీరందరికీ ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ పరీక్షలు నిర్వహించగా, ఒక బాలికకు ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగిలిన 515 మందికి నెగెటివ్‌గా వచ్చింది. జ్వరం బారినపడిన బాలికల్లో 44 మందికి నిర్వహించిన జ్వరం సంబంధిత పరీక్షల ఫలితాలు సాధారణంగా వచ్చాయి. రక్త నమూనాలను మరింత సమగ్ర పరీక్షల కోసం పంపించారు.

తుపాను అనంతర వైరల్‌ జ్వరాలుగా అనుమానం

జనరల్‌ మెడిసిన్‌, పిల్లల వైద్య నిపుణులతో నవంబర్‌ 6న ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యుల క్లినికల్‌ పరిశీలన ఆధారంగా బాలికలకు తుపాను అనంతర వైరల్‌ జ్వరాలు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాలికలకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

నీటి నమూనాల పరీక్షలు

వసతి గృహంలోని మూడు వేర్వేరు నీటి వనరుల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ అధికారులు నవంబర్‌ 6న అదనపు నీటి నమూనాలను సేకరించారు. వసతి గృహంలో రెండు ఆర్‌ఓ ప్లాంట్లు ఉండగా, ఒకటి మరమ్మతులో ఉంది. బాలికలకు కాచి చల్లార్చిన నీటిని అందిస్తున్నారు. వంటశాల, వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి పరీక్షల్లోనూ సాధారణ ఫలితాలు వచ్చాయి.

ఇతర ప్రాంతాల్లో జ్వరాలు లేవు

వసతి గృహానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న కురుపాం గ్రామంలో జ్వరం కేసులు నమోదు కాలేదు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.

జిల్లాలోని అన్ని వసతి గృహ పాఠశాలల్లో జ్వరాలపై నిరంతర నిఘా, బాలికలకు పరీక్షలు నిర్వహించాలని క్షేత్రస్థాయి వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన చోట తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు.

బాలికలకు నిరంతరం వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆర్‌. వెంకటరమణ మాట్లాడుతూ.. కురుపాం శివన్నపేట గురుకుల పాఠశాలలో జ్వరాల బారినపడిన బాలికలను జనరల్‌ మెడిసిన్‌, పిల్లల వైద్య నిపుణులు పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రత్యేక వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. బాలికలందరికీ అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.