-వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్ పనితీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున పరిశీలించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును వారు ప్రత్యక్షంగా వీక్షించారు. కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఎలా పర్యవేక్షిస్తున్నారు, వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది అనే అంశాలను మీడియా కు వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,500 సీసీ కెమెరాలను ఏయే జిల్లాల్లో, ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు, వాటి ద్వారా ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే వివరాలను అధికారులు కమిషనర్‌కు వివరించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం, పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కీలక పరిణామాన్ని నిరంతరం పర్యవేక్షించడం, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండేందుకు ఈ వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
