-తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ పి. పుల్లారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సన్నద్ధతపై సీఎండీ పి. పుల్లారెడ్డి అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో వాటిని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.అన్ని సర్కిల్,డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని,తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఏ విద్యుత్ ఉద్యోగి సెలవు తీసుకోవడానికి వీలు లేదని సీఎండీ తెలిపారు.
తుఫాన్ సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు లేదా సరఫరా అంతరాయాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
