– ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రం సందర్శన
– కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష
– పారదర్శకంగా, నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు చేపట్టాలని వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచన
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
కొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ శనివారం సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు నిర్వహణ, కౌంటింగ్ సిబ్బంది విధులు, కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లెక్కింపు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.
