ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్. నాగలక్ష్మి, ఐఏఎస్

– కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన
– ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సిబ్బందికి సూచన
– పారదర్శకంగా, నిష్పక్షపాతంగా లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త:
మైలవరం లక్కిరెడ్డి లక్ష్మిరెడ్డి ఇండోర్ స్టేడియంలో శనివారం కొనసాగుతున్న మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్) ఎస్. నాగలక్ష్మి ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటింగ్ టేబుళ్లను సందర్శించి, ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును పరిశీలించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయక సిబ్బంది విధుల నిర్వహణ, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, ఓట్ల లెక్కింపు విధానాలను అడిగి తెలుసుకున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, అధికారులకు ఎన్నికల ఏజెంట్లకు కల్పించిన సౌకర్యాలు, కౌంటింగ్ హాళ్లలో నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు తలెత్తకుండా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమైన దశ అని, ఈ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పరిశీలకులు వెంట విజయవాడ ఆర్డీవో వెన్నెల శీను తదితరులు ఉన్నారు.