-ఏపీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ ముగింపు వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BS&G) ఆధ్వర్యంలో 75వ జాతీయ పతాక దినోత్సవం, వజ్రోత్సవ ముగింపు వేడుకలు శనివారం విజయవాడలోని లోక్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు ప్రారంభోపన్యాసం చేస్తూ, రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, సంస్థ సభ్యుల గణాంక వివరాలను వెల్లడించారు.
రాజ్యపురస్కార్ పరీక్షా శిబిరంలో అర్హత సాధించిన స్కౌట్స్, గైడ్స్‌ను రాష్ట్ర బీఎస్&జీ చీఫ్ కమిషనర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. తమీమ్ అన్సరియా, ఐఏఎస్ అభినందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు. పాఠశాలల్లో స్కౌటింగ్, గైడింగ్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు, అవసరమైన సమయంలో సమాజానికి సేవలందించేలా వారిని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
అనంతరం రాజ్యపురస్కార్ సాధించిన స్కౌట్స్, గైడ్స్‌కు గవర్నర్ సర్టిఫికెట్లు అందజేశారు. 75 ఏళ్లు పైబడినప్పటికీ సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్న సీనియర్ స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గైడ్స్ కమిషనర్ ఎన్. నాగమణి, రాష్ట్ర స్కౌట్స్ కమిషనర్ వి.ఎస్. సుబ్బారావు, రాష్ట్ర బుల్బుల్స్ కమిషనర్ తాహెరా సుల్తానా, వివిధ జిల్లాల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
