విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ కస్తూరిబాయిపేటలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న బొండా సిద్ధార్థకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దేవాలయాలకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. దైవభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పండుగలు, పూజా కార్యక్రమాలు ప్రజలందరినీ ఒకచోట చేర్చి సామాజిక ఐక్యతను చాటుతాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి, ముగింపు సందర్భంగా అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు, భక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు
