– జాతీయ సరస్ మేళాలో పారిశ్రామికాభివృద్ధి, మార్కెటింగ్‌పై అవగాహన
– సహజ వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక కార్యక్రమాలు
– మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026లో భాగంగా లఖ్పతి దీదీల కోసం పారిశ్రామికాభివృద్ధి, మార్కెటింగ్, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ లఖ్పతి దీదీ కార్యక్రమానికి సాంకేతిక భాగస్వామిగా ఉన్న BRAC International ప్రతినిధి శ్రుతి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెవిలియన్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఉత్పత్తుల నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన ధరల నిర్ణయం, ఆర్థిక నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునే మార్గాలను వివరించారు. నాలెడ్జ్ పెవిలియన్‌లో రైతు సాధికార సంస్థ (RySS) ప్రతినిధులు నాగలత, దేవిక ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయం ద్వారా నేల, మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. వంటింటి తోటలు, పెరటి కోళ్ల పెంపకం వంటి పద్ధతులు కుటుంబాలకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అదనపు ఆదాయానికి దోహదపడతాయని తెలిపారు. పోషకాహార ఆధారిత వ్యాపారాలు, గ్రామీణ మార్టులు, ఆరోగ్యకరమైన చిరుతిళ్ల తయారీ ద్వారా మహిళలు కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కార్యక్రమంలో వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు ఆరోగ్యకరమైన కుటుంబాలు, స్థిరమైన గ్రామీణ జీవనోపాధుల నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి.
