ఎస్.ఎస్.టి బృందాల పనితీరు పకడ్బందీగా ఉండాలి: ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్

-పైపుల రోడ్డు వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యయ పరిశీలకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ నగదు, మద్యం, బహుమతుల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ పైపుల రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎస్.టి తనిఖీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు. తనిఖీ కేంద్రంలో నిర్వహిస్తున్న వాహన తనిఖీ రిజిస్టర్లను, సీజ్ వివరాల రికార్డులను వ్యయ పరిశీలకులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి వాహనం వివరాలను, తనిఖీ సమయాన్ని తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. తనిఖీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగేలా నిరంతరం వీడియోగ్రఫీ నిర్వహించాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా తరలించే నగదు, మద్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల తనిఖీ సమయంలో సాధారణ ప్రయాణికులు, అత్యవసర సేవల వాహనాలకు అనవసర ఆటంకాలు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50,000 కంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు రవాణా చేస్తే వెంటనే స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఎస్.ఎస్.టి సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. “ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహాన్ని అరికట్టి, ఎన్నికలు స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో జరిగేలా చూడటమే వ్యయ పర్యవేక్షణ బృందాల ప్రధాన బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్ తెలిపారు.

ఈ ఆకస్మిక తనిఖీలో ఎస్.ఎస్.టి బృంద సభ్యులు, స్థానిక పోలీస్ అధికారులు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.