‘ఆర్నబ్’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసినా బుడమేరు ప్రవాహానికి ఆటంకం కలగకూడదు

-న్యూ రాజరాజేశ్వరి పేట వద్ద బుడమేరు ప్రవాహం, పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
-సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ హెచ్చరిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తీవ్ర తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, బుడమేరులో వరద నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేట పరిసర ప్రాంతాలలో బుడమేరు నీటి ప్రవాహ పరిస్థితిని, గట్లను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో బుడమేరు వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అటువంటి చేదు అనుభవాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున, నీరు సాఫీగా దిగువకు వెళ్లేలా ప్రవాహ మార్గాల్లోని పూడిక, గుర్రపుడెక్క వంటి అడ్డంకులను ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన తొలగించాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. బలహీనంగా ఉన్న బుడమేరు గట్లను గుర్తించి, తక్షణమే పటిష్టపరిచే పనులు చేపట్టాలని, గట్ల వెంబడి నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు.

క్షేత్రస్థాయి పర్యటన అనంతరం న్యూ రాజరాజేశ్వరి పేట పరిధిలో స్థానిక ప్రజల కోసం ముందస్తుగా సిద్ధం చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వర్ష తీవ్రత పెరిగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైతే, ప్రజలను సురక్షితంగా తరలించేందుకు రవాణా, సిబ్బంది సిద్ధంగా ఉండాలి. పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందే వారికి తాగునీరు, నాణ్యమైన భోజనం, నిరంతర విద్యుత్, వైద్య శిబిరాలు మరియు శానిటేషన్ వంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోటుపాట్లు రానివ్వరాదన్నారు.

వదంతులు నమ్మవద్దు – తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

బుడమేరు ప్రవాహంపై ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అధికారికంగా వెల్లడిస్తుందని కలెక్టర్ తెలిపారు. కొందరు కావాలని గత పాత చిత్రాలు, వీడియో క్లిప్‌లతో సోషల్ మీడియా వేదికగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని, అటువంటి వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఎవరూ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.