విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, బెంజ్ సర్కిల్ సమీపంలోని ఈనాడు గ్రౌండ్స్‌లో బాణసంచా దుకాణదారులకు అగ్నిప్రమాద నివారణ చర్యలపై శనివారం ఉదయం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీజీ ఫైర్ సర్వీసెస్ పి.వి. రమణ, అడిషనల్ డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ జి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వ్యాపారులకు అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రతి బాణసంచా దుకాణానికి కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలని, ప్రతి దుకాణంలో నీటితో నింపిన డ్రమ్ములు, ఇసుకతో నింపిన బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వంటి అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకున్న అనంతరమే దుకాణాలకు వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి కల్పిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈనాడు గ్రౌండ్స్, సితార గ్రౌండ్స్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్ద మూడు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కల్పించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో అగ్నిమాపక పరికరాల లభ్యతను పరిశీలించడంతో పాటు, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర చర్యలపై వ్యాపారులకు శిక్షణ అందించినట్లు వివరించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణసంచా కొనుగోలు చేసే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరారు. ప్రతి బాణసంచా విక్రయ ప్రాంతంలో జిల్లా అగ్నిమాపక శాఖ సమన్వయంతో ఒక ఫైర్ ఇంజన్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో డీఎఫ్ మాల్యాద్రి, ఎస్ఎఫ్ఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
