జీఎంసీ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

-పోలింగ్ విధుల్లో 3,576 మంది సిబ్బంది.. భద్రతకు 1,500 మంది పోలీసులు
-నవంబర్ 3న ఓట్ల లెక్కింపు.. 50 హాళ్లలో 468 కౌంటింగ్ టేబుళ్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, పూర్తి పారదర్శకతతో, ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

శుక్రవారం గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ పంపిణీ ట్రయల్ రన్‌ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్‌కు ముందు రోజు నిర్వహించే ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంపిణీ కేంద్రంలో కౌంటర్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, క్యూలైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శనివారం జరిగే మెటీరియల్ పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణ కోసం 26 వార్డులకు 26 మంది, మేయర్ స్థానానికి ఒకరితో కలిపి మొత్తం 27 మంది రిటర్నింగ్ అధికారులు, 76 మంది వార్డు ఏఆర్ఓలు, మేయర్ స్థానానికి ఒకరితో కలిపి మొత్తం 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరంతా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు విధుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. అదేవిధంగా 13 మంది జోనల్ అధికారులు, 61 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పోలింగ్ ఏర్పాట్లు, పర్యవేక్షణ కోసం 593 మంది పోలింగ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారులు, 75 మంది వార్డు సూపర్‌వైజర్లను నియమించారు. పోలింగ్ నిర్వహణకు 596 మంది ప్రిసైడింగ్ అధికారులు, 596 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,384 మంది ఇతర పోలింగ్ అధికారులతో కలిపి మొత్తం 3,576 మంది సిబ్బందిని కేటాయించినట్లు కమిషనర్ వెల్లడించారు.

ఎన్నికల విధుల నిర్వహణకు అదనంగా 1,500 మంది పోలీసులతోపాటు సుమారు 2,000 మంది జీఎంసీ అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశామని చెప్పారు. పోలీసు బందోబస్తు మధ్య నిర్ణీత సమయానికి సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తామన్నారు.

పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని తెలిపారు. అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, ఆహార సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్దేశిత సమయానికి విధులకు హాజరై ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.

కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు

నవంబర్ 3వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకోసం 50 హాళ్లలో 468 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 2,160 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఐ. కిశోర్, జి. రవీంద్ర, డిప్యూటీ కమిషనర్లు జి. సాంబశివరావు, బి. శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్‌ఈ జి. వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ డాక్టర్ సురేష్ బాబు, బయాలజిస్ట్ శేషయ్య, ఉపా సెల్ పీఓ సింహాచలం, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.