గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్దం

-నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్..
-గుంటూరు నగరంలో మొత్తం 76 వార్డులు మరియు 596 పోలింగ్ కేంద్రాలు
-నగరంలో మొత్తం 6,18,714 మంది ఓటర్లు నమోదు కాగా, అందులో 3,00,471 మంది పురుషులు, 3,18,164 మంది మహిళలు మరియు 79 మంది ఇతరుల
-ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక వసతులు ఏర్పాటు పూర్తి
-ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శనివారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 0863 2345103
-పోలింగ్ రోజు ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు
-నగర పరిధిలో ఇప్పటికే 85 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి
-207 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తింపు (93 సెన్సిటివ్ మరియు 114 హైపర్ సెన్సిటివ్).
-సమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తం 414 వెబ్ కెమెరాలతో జిఎంసిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్.

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 76 వార్డుల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేశామని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగరంలో మొత్తం 6,18,714 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 3,00,471 మంది పురుషులు, 3,18,164 మంది మహిళలు, 79 మంది ఇతరులు నమోదయ్యారని వెల్లడించారు. ఓటర్ల సౌకర్యార్థం 596 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రంలో నీడ ఉండేలా, దివ్యాంగుల కోసం ర్యాంప్‌లు, బ్యారికేడింగ్, విద్యుత్, తాగునీరు మరియు మరుగుదొడ్ల వసతులను కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో 85 శాతం ఓటర్ స్లిప్పులను ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశామన్నారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో సులభంగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ 0863 2345103 అందుబాటులో ఉంటుందన్నారు. ఓటు సమాచారం కొరకు ఆన్ లైన్ ద్వారా కూడా https://sec-ems.ap.gov.in/apsec/getDetailsSearchYouNameNew ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. నగరంలో 207 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, వీటిలో 93 సెన్సిటివ్, 114 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ 207 కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తం 414 వెబ్ కెమెరాలతో జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.