అభివృద్ధే లక్ష్యం.. ఆశీర్వదించి గెలిపించండి…

-55వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పెద్ది రమేష్ విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
55వ డివిజన్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పెద్ది రమేష్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
55వ డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పెద్ది రమేష్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని పేర్కొంటూ, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై, తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో అవినీతిరహిత, పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తనకు కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ అభివృద్ధికి కూటమి నాయకుల సహకారంతో మరింత కృషి చేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో తనను గెలిపించాలని పెద్ది రమేష్ విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.