61వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా…

-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుక్కల అనిత విజ్ఞప్తి
-ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కుక్కల అనిత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మెరుగైన తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. 61వ డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అదేవిధంగా విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపి ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం: మల్లాది విష్ణు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రజా సమస్యలపై బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతోందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులకు గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. బియ్యం, వంటనూనె, పంచదార, పాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని ఆయన విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, పేదలు, భర్తను కోల్పోయిన మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ, అర్హులైన వారందరికీ సకాలంలో పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని మల్లాది విష్ణు కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.