కోటి దాటిన కోకొల్లల రుచుల సంగమం..

– స‌రికొత్త మైలురాయిని స‌ర‌స్ శ‌క్తి ఫుడ్ కోర్టు ప్రాంగ‌ణం
– ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, వీఎంసీ ధ్యాన‌చంద్ర‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ, పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు, వారి నైపుణ్యాలకు, ఆర్థిక స్వావలంబనకు చక్కని వేదికగా నిలుస్తోందని.. అదే విధంగా ప్రాంగణంలోని లైవ్ ఫుడ్ కోర్టులో అమ్మకాలు కోటి రూపాయలు దాటడం విశేషమని, ఇది ఆహార ప్రియుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మహిళల కృషికి నిదర్శనమని అన్నారు.
స‌ర‌స్ మేళాలోని ఫుడ్ కోర్టులో అమ్మ‌కాలు రూ. కోటి దాటిన సంద‌ర్భంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం పాల్గొన్నారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల ఆహార ఉత్పత్పుల విజ‌యాన్ని పుర‌స్క‌రించుకొని వారిని అభినందించి ప్రోత్స‌హించారు. కేక్ క‌ట్ చేసి విజ‌యానంద‌పు రుచిని పంచిపెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు, సంప్రదాయ ఆహార రుచులను ఒకే వేదికపై ఆస్వాదించే అవకాశం సరస్ మేళా ద్వారా కలుగుతోందన్నారు. 50 లైవ్ ఫుడ్ స్టాల్స్‌లో వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను అక్కడికక్కడే తయారుచేసి అందించడం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహార వైవిధ్యాలను పరిచయం చేస్తూ ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. మహిళలు తమ నైపుణ్యాలను వ్యాపార అవకాశాలుగా మలుచుకొని, స్వయంగా ఆదాయం సంపాదిస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కల్పించడం, వినియోగదారులతో నేరుగా అనుసంధానం చేయడం వంటి లక్ష్యాలకు సరస్ మేళా దోహదపడుతోందని వివ‌రించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. మాట్లాడుతూ జాతీయ సరస్ మేళా నగరంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలకు వివిధ రాష్ట్రాల ప్రత్యేక ఆహార రుచులను ఒకే వేదికపై ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. లైవ్ ఫుడ్ కోర్టులో కోటి రూపాయలకు పైగా అమ్మకాలు నమోదవడం మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతిభకు, కృషికి, ఆహార ప్రియుల ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఇలాగే మ‌రిన్ని విజ‌యాల‌ను సొంతం చేసుకోవాల‌ని ధ్యాన‌చంద్ర ఆకాంక్షించారు.
*సరస్ మేళాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ సేవల ప్రాధాన్యత, రుణ సదుపాయాల వినియోగం, ఆర్థిక నిర్వహణతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తమ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడం, ఆన్‌లైన్ విక్రయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకొని, ఆధునిక మార్కెటింగ్ పద్ధతులను అనుసరిస్తూ ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించేలా అవగాహన కల్పించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.