ఆర్టీసీ జేఏసీ–యాజమాన్యం చర్చలు విఫలం

-1,450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలని జేఏసీ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
1,450 విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు చేసిన చర్చలు విఫలమయ్యాయి. శుక్రవారం ఆర్టీసీ హౌస్‌లో జేఎండీ శివప్రసాద్‌తో జరిగిన చర్చల అనంతరం జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఈ విషయం వెల్లడించారు.

విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంత సిబ్బందితోనే నిర్వహించాలని, ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించవద్దని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే, టెండర్ల రద్దు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశమని, ప్రస్తుతం రద్దు చేయడం సాధ్యం కాదని యాజమాన్యం తెలిపినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను పునఃప్రారంభించేందుకు టెండర్లు పిలుస్తామని జేఎండీ వెల్లడించారు.

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను భర్తీ చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 వేల డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఇటీవల ఉద్యోగులు నిర్వహించిన నల్లబ్యాడ్జీల నిరసనలు విజయవంతమయ్యాయని తెలిపారు.

ఉద్యోగుల ప్రయోజనాలు, ప్రజారవాణా పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.