-తిరువూరులో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
-ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
గురువారం తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక ప్రాంతాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. లక్ష్మీపురం గ్రామంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించిన కలెక్టర్, ఎన్నికల శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లకు అవసరమైన కనీస మౌలిక వసతులు తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, వెలుతురు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. శ్రీ వాహిని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన బారికేడింగ్, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్, పోలీసు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉండే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. తిరువూరు పట్టణ పరిధిలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ తిరిగి చేపడుతున్న ఓటర్ సమాచారo స్లిప్పుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరుకు గడువులోగా స్లిప్పులు అందేలా పర్యవేక్షించాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ఞ, తహసీల్దార్ డి.చంద్రమౌళి, ఎంపీడీవో సిహెచ్. రవిబాబు తదితర రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
