-సహాయక చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొనాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయ చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు చురుగ్గా పాల్గొనాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తుపాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించిన నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలించిన నేపథ్యంలో వారికి అవసరమైన ఆహారం, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి తగిన సహకారం అందించాలని సూచించారు. అదేవిధంగా తుపాను కారణంగా రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి సహాయం అందించాలని జనసేన శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
