-ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు
-ప్రక్రియను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ, మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఓటర్ల నమోదు, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, బ్యాలెట్ బాక్సుల భద్రత, సిబ్బంది సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిబంధనల ప్రకారం జరగాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్ రూమ్లు, బ్యాలెట్ పెట్టెలకు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి వచ్చే ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని సహాయక కౌంటర్లు, మార్గదర్శక బోర్డులు, మంచినీరు తదితర ప్రాథమిక వసతులు కల్పించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, నోడల్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
