​ప్రభుత్వ ఐ.టి.ఐ., విజయవాడలో బ్రిక్స్ (BRICS) సస్టెనబుల్ లైఫ్‌స్టైల్ వీక్ – నాల్గవ రోజు కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:

​ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టైన్బుల్ లైఫ్ స్టైల్ వీక్ కార్యక్రమాలలో భాగంగా బుధవారం చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార విధానాలను ప్రోత్సహిద్దాం” అనే ప్రధాన అంశంపై ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ విజయవాడలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఐ.టి.ఐ., విజయవాడ ప్రిన్సిపాల్ ఎం. కనకరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, పోషక విలువలు కలిగిన సంప్రదాయ ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు మరియు సిబ్బందికి చిరుధాన్యాల ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాల సాగు పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా తక్కువ నీటి వినియోగంతో సాగు చేయవచ్చని, రైతులకు మరియు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. స్థానికంగా లభించే పోషకాహారాన్ని ప్రోత్సహించడం, ఆహార వృధాను నివారించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.