వడ్డమాను గ్రామంలో ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులు

-అమరావతి అభివృద్ధికి 2 ఎకరాల భూమిని పూలింగ్‌కు ఇచ్చిన రైతు కుటుంబం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా వడ్డమాను గ్రామంలో ఉన్న తమ రెండు ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు మందడం గ్రామానికి చెందిన నూతక్కి శ్రీరావమ్మ ముందుకొచ్చారు.

ఈ మేరకు శనివారం (2026 నవంబర్ 7) ఏపీ సీఆర్డీఏ (APCRDA) కాంపిటెంట్ అధికారి కె. విజయలక్ష్మికి అంగీకార పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (రిటైర్డ్) ఎస్. రాఘవేంద్ర, తహసీల్దార్ (రిటైర్డ్) రవికుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీరావమ్మ మాట్లాడుతూ, ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాజధాని అభివృద్ధి కోసం చేపడుతున్న రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు స్థానిక రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏపీ సీఆర్డీఏ అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.

అమరావతి అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం కీలకమని, స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.