-అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన మేయర్ లు , చైర్పర్సన్లు, వార్డు సభ్యుల తొలి సమావేశాలను 2026 నవంబర్ 23వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇది వరకే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1994లోని సెక్షన్ 7(1)(a), ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965లోని సెక్షన్ 20(1)(a) ప్రకారం ఎన్నికైన సభ్యుల పదవీకాలం తొలి సమావేశానికి నిర్ణయించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం నవంబర్ 23వ తేదీని తొలి సమావేశాల తేదీగా నిర్ణయించారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లలో తొలి సమావేశాలు నిర్వహించనున్నారు.
అలాగే 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కూడా అదే రోజు తొలి సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన మేయర్లు ,చైర్పర్సన్లు వార్డు సభ్యులతో చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అనంతరం కార్పొరేషన్ లలో డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో వైస్ చైర్పర్సన్ల ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లను, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వైస్ చైర్పర్సన్లను నవంబర్ 23వ తేదీన ఎన్నుకోనున్నారు.
చట్ట నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను తొలి సమావేశంలో లేదా తొలి సమావేశం జరిగిన తేదీ నుంచి రెండు వారాల్లోపు నిర్వహించే తదుపరి సమావేశంలో నిర్వహించవచ్చు.
ఈ మేరకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు తొలి సమావేశాల నిర్వహణ, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ప్రాధికార సంస్థ ఆదేశించింది.
నవంబర్ 23వ తేదీ నుంచి రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది.
