-కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారంలో పాల్గొనడంతో సందడి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. 58, 59, 60, 61, 42వ డివిజన్ల పరిధిలో సాగిన ఈ రోడ్‌షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.
కోరిటిపాడు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ప్రారంభమైన రోడ్‌షో లైబ్రరీ సెంటర్, చైతన్యపురి మెయిన్ రోడ్డు, ముత్యాలరెడ్డి నగర్ మెయిన్ రోడ్డు, వేలంగిని నగర్ ఆర్చి, అమరావతి రోడ్డు మీదుగా కొనసాగింది. అనంతరం ఆల హాస్పిటల్, పీఎస్ నగర్ మెయిన్ రోడ్డు, చంద్రయ్య నగర్ సెంటర్ మీదుగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడి నుంచి అరండల్‌పేట ఐదో లైన్ లైబ్రరీ సెంటర్ వరకు ప్రచారం సాగింది.
రోడ్‌షో మార్గంలో పలుచోట్ల స్థానికులు నాయకులకు స్వాగతం పలికారు. మహిళలు, యువత, స్థానిక ప్రజలు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు గుంటూరు నగర అభివృద్ధి, రహదారుల మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి అంశాలను ప్రస్తావించారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వివరిస్తూ, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు జనసేన నాయకులు కిలారి రోశయ్య, మాదాల చైతన్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
