ప్రపంచ వేదికపై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. చాంటిక్లియర్ బృందానికి చంద్రబాబు ప్రశంసలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026 వేదికపై గ్రామీ అవార్డు విజేత చాంటిక్లియర్‌కు చెందిన ‘A Cappella’ సంగీత బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తన ‘బ్రహ్మమొక్కటే’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ సంగీత బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
15వ శతాబ్దపు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనను అంతర్జాతీయ సంగీత వేదికపై ఆలపించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం పేర్కొన్నారు. సకల జీవులంతా ఒక్కటేననే అన్నమయ్య సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడం తెలుగు సంస్కృతి, సాహిత్య గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.
భాషలు, దేశాల సరిహద్దులు, తరాలకు అతీతంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతున్నాయని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అజరామరమైన అన్నమయ్య కీర్తనను అద్భుతంగా ఆలపించిన చాంటిక్లియర్ సంగీత బృందాన్ని అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు భక్తి సంగీతానికి గుర్తింపు లభించడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.