-రాజమహేంద్రవరంలో 81 కేసుల విచారణ.. 39 కేసుల్లో తుది ఉత్తర్వులు
-కర్నూలులో 41 కేసుల విచారణ.. 26 కేసుల్లో తుది ఉత్తర్వులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, కర్నూలు కేంద్రాల్లో నాలుగో రోజు బెంచీల నిర్వహణ కార్యకలాపాలు గురువారం సజావుగా జరిగాయి.
రాజమహేంద్రవరం కేంద్రంగా నిర్వహించిన క్యాంపు కోర్టులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి విచారణలు చేపట్టగా, కర్నూలులోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, జె.వి. మనోహర్ రెడ్డి బెంచ్ నిర్వహించారు. ఈ రెండు కేంద్రాల్లోనూ నూతన ఫిర్యాదుల స్వీకరణతో పాటు గతంలో దాఖలైన కేసుల విచారణలు కొనసాగాయి.
రాజమహేంద్రవరం క్యాంపు కోర్టులో మొత్తం 81 కేసులను విచారణకు స్వీకరించగా, వాటిలో 39 కేసులకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువరించారు. మిగిలిన 42 కేసులను తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేశారు. ఈ కేసుల్లో 7 నూతన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 మంది ఫిర్యాదుదారులు కొత్తగా కేసులు దాఖలు చేసేందుకు హాజరయ్యారు. కమిషన్ నిబంధనలు, ఫిర్యాదుల దాఖలు విధానాలపై వారికి అధికారులు అవగాహన కల్పించడంతో, తదుపరి క్యాంపు కోర్టు నిర్వహణ సమయంలో మరిన్ని ఫిర్యాదులు దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
