– వైసీపీ శ్రేణుల బరితెగింపు.. నామినేషన్ వేయడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై మహిళలతో కారం చల్లించి మారణాయుధాలతో దాడులు
– దొంగ ఓట్లు, రిగ్గింగ్ రాజకీయాలకు పులివెందుల ప్రజలు గుణపాఠం చెప్పారన్న ఎమ్మెల్సీ వర్ల రామయ్య
– లేళ్ళ అప్పిరెడ్డికి పరామర్శ పేరుతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జైల్లోకి దూసుకెళ్లిన సజ్జల, పెద్దిరెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా?
– కడప, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ రౌడీ మూకలు సృష్టించిన విధ్వంసం, అరాచకాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్పడుతున్న దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు ఫిర్యాదు చేసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్‌లతో కూడిన బృందం కమిషనర్‌ను కలిసి సమగ్రమైన లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. పల్నాడు జిల్లా మునుగోడులో టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, మహిళలు కారంపొడి చల్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో టీడీపీ కార్యకర్తలకు చెందిన రెండు బైకులు, ఒక కారుకు నిప్పు పెట్టారని తెలిపారు. అలాగే తొండూరు మండలం ఆగూడూరు నామినేషన్ కేంద్రం వద్దే టీడీపీ శ్రేణులపై రాళ్లు, ఆయుధాలతో దాడి జరగడంతో ఏఎంసీ చైర్మన్ రామ సురారెడ్డి పరిస్థితి విషమంగా మారిందని, మరో ముగ్గురికి తీవ్ర రక్తగాయాలయ్యాయని వివరించారు. మార్కాపురం జిల్లా పీసీపల్లె మండలం పెదఇర్లపాడు ఆర్వో (రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలోకి కొందరు చొరబడి టీడీపీ నేత కొండారెడ్డి భూమిరెడ్డిపై దాడికి యత్నించారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం సర్పంచ్ అభ్యర్థి చిన్న కోటయ్యపై దాడి జరగడంతో ఆయనకు తీవ్ర రక్తగాయాలయ్యాయని కమిషనర్‌కు వివరించారు. పల్నాడు, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను టీడీపీ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేసింది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీని కలిసిన అనంతరం ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా మూకలు పథకం ప్రకారం భౌతిక దాడులకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమ పార్టీ ముఖ్య నాయకుడిపై వైకాపా గూండాలు కక్షగట్టి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అడ్డుపెట్టుకుని, కొంగుల్లో కారం తెచ్చి తెదేపా కార్యకర్తల కళ్లలో చల్లారని, ఆపై రప్పా రప్పా బ్యాచ్ ఐరన్ రాడ్లు, కర్రలు, బండరాళ్లతో విచక్షణారహితంగా కొట్టారని వివరించారు. ఈ దాడిలో తమ నాయకుడి తలకు 16 కుట్లు పడ్డాయని, చనిపోయాడనుకుని వదిలివెళ్లగా ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, ఆధారాలను కమిషనర్‌కు చూపించగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ఇంతటి ఘోరమైన దాడి జరిగితే పోలీసులు సాధారణ గాయాల కింద (325 ఐపిసి) కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని, తక్షణమే దీన్ని హత్యాయత్నం (పాత 307 ఐపిసి / కొత్త చట్టం 109 బిఎన్ఎస్) కేసుగా మార్చి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పెదకూరపాడు, కడప, పులివెందుల ప్రాంతాలు నేరాలకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా పులివెందులను తమ అడ్డాగా మార్చుకుని దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తో గెలుస్తూ వచ్చిన వైఎస్ కుటుంబానికి అక్కడి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని వర్ల రామయ్య అన్నారు.
ప్రజల్లో చైతన్యం, ధైర్యం రావడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ఫలితంగా వైకాపా ఘోర పరాజయం పాలైందని పేర్కొన్నారు. అధికారం కోల్పోయి, పరువు పోవడంతో జగన్ మోహన్ రెడ్డి మయసభ నుంచి బయటకు వచ్చిన దుర్యోధనుడిలా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. పులివెందులలో వైకాపా అరాచక దుకాణం బంద్ అయిందని, ఇకపై ప్రజలను భయపెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎక్కడ నామినేషన్లు ఆపారో, ఎప్పుడు ఆపారో ఆధారాలు చూపాలని సవాల్ విసిరితే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని, తిరిగి ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పటికైనా వైకాపా నేతలు ప్రజాతీర్పును గౌరవించాలని హితవు పలికారు. గుంటూరు జిల్లాలో రెండు రోజుల క్రితం జైల్లో ఉన్న రౌడీ షీటర్ లేళ్ళ అప్పిరెడ్డిని పరామర్శించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందలాది మంది కార్యకర్తలతో వచ్చి నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని వర్ల రామయ్య గుర్తు చేశారు. జైలు సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లిన ఘటనలో ఒక పోలీసు అధికారి కాలికి గాయమైందని, అయినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోవాలని, అరాచకాలకు పాల్పడేది ఏ పార్టీ వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు, ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
