డిసెంబర్ 18 నుంచి 21 వరకు రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ షో

–ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పూల పెంపకం, ఉద్యానవనాల అభివృద్ధి, పచ్చదనం విస్తరణతో పాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెంపొందించేందుకు రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ షో ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న 9వ రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ షో పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు. నగర ప్రజలు, ప్రకృతి ప్రేమికులు, పూల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. విజయవాడలోని లలితా జ్యువెల్లరీ సమీపంలో ఉన్న సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రదర్శనలో వివిధ రకాల గులాబీ పూలు, ఉద్యానవన మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు నర్సరీ మేళా, సేంద్రియ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటి పరిసరాల్లో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోజ్ సొసైటీ అధ్యక్షురాలు కె. లక్ష్మీ తులసి, కార్యదర్శి కె. విశాల, సభ్యులు సీతా మహాలక్ష్మి, జి.ఎస్.ఆర్. మోహన్ రావు, జి.లక్ష్మి, సుమ బిందు తదితరులు పాల్గొన్నారు.