-రాజాం, గన్నవరం, తిరువూరుల్లో అగ్నిప్రమాదాలు
-అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయనగరం జిల్లా రాజాం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీఎత్తున ఆస్తినష్టం జరిగింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్‌పై పడి మంటలు అంటుకోవటంతో షోరూమ్ దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసినట్టు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాణా సంచా కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరిపడి ఓ ఫర్నిచర్ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. తిరువూరులోని మరో దుకాణంలోనూ షార్ట్ సర్క్యూట్ జరిగి దుకాణం దగ్దమైంది. మంటల కారణంగా ఆస్తినష్టం జరగటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ మూడు ఘటనలపై ఆరా తీసిన సీఎం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
