ప్లాస్టిక్ సంచులకు స్వస్తి.. చేతి సంచులకు జై!

-వీధి నాటకంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మేయర్ కార్యాలయం వద్ద ‘ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ శ్రీమతి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లె ఈశ్వరరావు వడ్డెర, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన వీధి నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నృత్యాలు, పాటలు, అర్థవంతమైన సంభాషణల ద్వారా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ నష్టాలను ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రకృతికి, మానవ ఆరోగ్యానికి కలిగే ముప్పును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం కలిగించారు.

ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులు, పునర్వినియోగ చేతి సంచులను ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ను వీడుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం.. స్వచ్ఛ, హరిత గుంటూరు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం! అని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.