గుంటూరులో వాయు కాలుష్య నియంత్రణకు ‘ఆల్గే ట్రీ’

-రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద గాంధీ పార్కులో ఏర్పాటు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఆల్గే ట్రీ’ (Algae Tree)లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరులోని గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆల్గే ట్రీలు వాయు కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇవి సాధారణ చెట్లు కాకుండా సూక్ష్మ శైవలాలతో నింపిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థలని వివరించారు. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని పేర్కొన్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థలో సోలార్ ప్యానెల్స్‌తో పాటు పంపులు, సెన్సార్లు, ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయని వివరించారు.

నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్కులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన అనంతరం నగరంలోని రద్దీ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఒక ఆల్గే ట్రీ సుమారు 20 నుంచి 25 పెద్ద చెట్ల కార్బన్ గ్రహణ సామర్థ్యానికి సమానంగా పనిచేయగలదని, దాని చుట్టూ సుమారు 15 మీటర్ల వ్యాసార్థంలో గాలిలోని కాలుష్య కారకాలను తగ్గించేందుకు సహాయపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

తొలుత పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ యోచిస్తోందన్నారు. విద్యాసంస్థల్లో ఆల్గే ట్రీలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు, యువతకు వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పచ్చదనంతో అనుసంధానం చేస్తూ నగరంలో స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు సుస్థిర పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.