దీపావళి వేళ ప్రధాని వ్యాఖ్యలు ఆందోళనకరం… : సిపిఐ కె రామకృష్ణ

-దిమాగీ నక్సల్స్ గురించి మోడీకి దిగులెందుకు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటున్న దీపావళి పండుగ శుభవేళ జవాన్ల సమక్షంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ నక్సలిజాన్ని అంతం చేశామని, ఇప్ప్పుడు దిమాగీ నక్సల్స్ గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించిన సందర్భంగా ప్రతిపక్షాలను కించపరచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 47 ఏళ్ల నక్సలిజాన్ని అంతం చేశామని ఒకవైపు చెబుతూనే, దిమాగీ నక్సల్స్ గురించి ఆలోచిస్తున్నామని మోడీ వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతం చేసామని చెబుతున్న మోడీ సర్కార్ దిమాగీ నక్సల్స్ గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఒక భావజాలాన్ని అంతం చేసామంటూ విర్రవీగుతున్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిన అంశాన్ని సానుకూలంగా వ్యక్తపరచకుండా, అదేదో ప్రభుత్వమే అంతం చేసినట్లు చెప్ప్పుకోవడం ప్రతిపక్ష పార్టీలను, నాయకులను కించపరచే పద్ధతుల్లో దేశ ద్రోహులుగా చిత్రీకరించడం సిగ్గుచేటు. దిమాగీ నక్సల్స్ అనే పేరుతో ప్రశ్నించే వారందరిపై నిర్భంధకాండ ప్రయోగించేందుకు సిద్ధపడాలనుకోవడం దుర్మార్గం. మరోవైపు లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు ప్రభుత్వం ప్రకటించిన “సరెండర్ Ê రిహాబిలిటేషన్ పాలసీ”ని అందజేయకుండా జాప్యం చేస్తూ వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. నిత్యం వారిపై పోలీసు నిఘాపెట్టి అవమానిస్తున్నారు. వారు ప్రజల్లో స్వేచ్ఛగా తిరగనీయకుండా ఒక రకమైన న్యూనతా భావానికి గురిచేస్తున్నారు. దీనిని భరించలేక, ఈ సమాజంలో ఇమడలేక తిరిగి అడవుల్లోకి వెళ్లాలనే ఆలోచనలోకి వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు. సమస్యను సమస్యగా చూసి పరిష్కారం కోసం కృషిచేయకుండా తమ రాజకీయ స్వార్థానికి వాడుకునేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందు వలననే ఈ దుస్థితి దాపురిస్తున్నది. భావజాలాన్ని ఎవరూ ఎప్పటికీ అంతం చేయలేరనేది గుర్తించాలి. నక్సలిజాన్ని అంతం చేసామనే భావన మోడీ సర్కార్‌కు ఉంటే, నిత్యం దిమాగీ నక్సల్స్ గురించి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలి.
ఏదేమైనా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన స్థాయిని మరచి ఈ విధంగా మాట్లాడడం శోచనీయం. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా పండుగల రోజు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక రకమైన కన్ఫూజన్‌లో ఇలాంటి మోడీ నోటి వెంట వస్తున్నాయి. ప్రజలందరూ కూడా చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తూ దీపావళి పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ రకంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.