ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

-నేవిగేటింగ్ న్యూవరల్డ్ ఆర్డర్ థీమ్‌తో సీఐఐ సమ్మిట్
-వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ ఆరు అంశాలపై చర్చ
-58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు
-ఇప్పటికే 6 ప్రాంతీయ సదస్సుల్లో రూ.86వేల కోట్ల ఒప్పందాలు
-నవంబరు 12, 13వ తేదీల్లో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
-ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్, దిగ్గజ కంపెనీల చైర్మన్‌లు, సీఈఓలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్‌తో విశాఖ వేదికగా ఈ నెల 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుంది. మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నూతన దశాదిశ అందించేలా ఈ పెట్టుబడుల సదస్సు విశాఖలో ఆవిష్కృతం కానుంది. కేవలం పెట్టుబడుల ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ వివిధ అంశాలపై మేథోమథనం నిర్వహించి ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ భాగస్వామ్య సదస్సులో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం అమిత్ షా సహా కేంద్రమంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమల్ని అనుసంధానించటమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిచేలా ఈ సదస్సులో చర్చలు, ఒప్పందాలు జరుగనున్నాయి. మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, సాంకేతికత, పరస్పర విశ్వాసం, నిపుణుల దార్శనిక ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ చర్చలు సాగనున్నాయి. ప్రపంచ దేశాలతో భారత ఆర్థిక భాగస్వామ్యానికి ప్రధాన వేదికగా ఈ సదస్సును 1995 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 58 దేశాల ప్రాతినిధ్యం, 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. సింగపూర్, నేపాల్, కంబోడియా, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, మొజాంబిక్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా తదితర దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. విధ దేశాల రాయబారులు, పారిశ్రామిక ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో పాటు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఏడీబీ, యునెప్ లాంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో భాగంగా 400 పైచిలుకు బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపుల కోసం బీ టూ జీ సమావేశాలు కూడా జరుగనున్నాయి.

ఏపీ ఉమెన్ గ్రోత్ సమ్మిట్ 2026

పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈ నెల 11 తేదీన పారిశ్రామిక ప్రతినిధుల మధ్య ముందస్తు సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి అధికారిక విందు ఇవ్వనున్నారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో 12, 13 తేదీల్లో ప్రధాన సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తారు. 12 తేదీ ఉదయం 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి నారా లోకేష్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి రాబర్టో తదితరులు సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్నారు. ఇక నవంబర్ 13, సాయంత్రం 4 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, వాల్యుచైన్, క్వాంటం టెక్నాలజీ, సెమీ కండక్టర్ సహా నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ సహకారం, నైపుణ్యాలు, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, ఆహార భద్రత, జీవ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. గత పెట్టుబడుల సదస్సు సహా వివిధ సందర్భాల్లో ఒప్పందాలను పారిశ్రామిక ప్రాజెక్టులుగా మలిచేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. 2025-26లో దేశంలోనికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.6 శాతం ఏపీ దక్కించుకుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన 6 సన్నాహక ప్రాంతీయ సదస్సుల ద్వారా 194 ఎంఓయూల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. తద్వారా 1.47 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.