విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ, అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు.
నీటి నిల్వలు, పారిశుధ్య లోపం కారణంగా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి అప్రమత్తతతో, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. విఎంసి కమిషనర్, డిపిఓ, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులతో నిర్వహించిన అత్యవసర టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
రేపటిలోగా 100% పారిశుధ్య పనులు పూర్తి కావాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో 24/7 ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెంటనే బ్లీచింగ్ చల్లడం, మురుగునీటి కాలువలను క్లియర్ చేయడం వంటివి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏ ఒక్క ప్రాంతం కూడా మిగలకుండా దోమల నివారణకు పూర్తిస్థాయిలో ఫాగింగ్ నిర్వహించాలన్నారు. అన్ని తాగునీటి వనరులు, ఓవర్ హెడ్ ట్యాంకులను తక్షణమే శుభ్రం చేయించాలన్నారు. ప్రతి నీటి వనరు వద్ద నిర్బంధంగా క్లోరినేషన్ చేపట్టి, రాబోయే మూడు రోజుల పాటు నిరంతరం క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేపట్టాలన్నారు. అతిసార (డయేరియా), డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలు ఉన్నవారిని తక్షణమే గుర్తించాలన్నారు. ఎక్కడైనా చిన్నపాటి వ్యాప్తి లేదా కేసులు నమోదైనా వెంటనే అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, తాజా వేడి ఆహారాన్ని తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలను తినవద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎల్లుండి నుంచి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానున్నందున, అధికారులు గ్రామాలకు వెళ్లే సమయానికి ఎక్కడా పారిశుధ్య లోపం, వ్యాధుల సమస్యలు లేదా వైద్య సేవలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదని పేర్కొన్నారు. రేపు సాయంత్రానికల్లా నిర్దేశించిన అన్ని రక్షణ చర్యలు, పారిశుధ్య పనులు 100% పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
