– ఎవరికీ ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పన
– నిరంతరం పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అర్నబ్ తుపాను ప్రభావిత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 605 స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మొత్తం 313 మంది ఆశ్రయం పొందుతున్నట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆహారం, తాగునీరు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన వారికి సకాలంలో వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు, అనారోగ్య సమస్యలున్న వారికి ప్రత్యేక శ్రద్ధతో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. నగరంతో పాటు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
