సుపరిపాలనకు జైకొట్టిన జనం.. స్థానిక పోరులో కూటమి జైత్రయాత్ర

-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిమను అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దారపనేని నరేంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న ప్రజానుకూల విధానాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ స్థానిక ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞమైన సుపరిపాలన, యువనేత నారా లోకేష్ దూకుడుగా చేపడుతున్న విద్యా, ఉపాధి సంస్కరణలు, పార్టీ శ్రేణుల్లో నింపుతున్న ఉత్సాహంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసాన్ని చాటారని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు, పారదర్శక పాలన పట్ల గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి అభ్యర్థులకు ఏకపక్షంగా మద్దతు పలికారు. కూటమికి చెందిన నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేసి ఈ ఘన విజయాన్ని సాధించారని, ప్రతి కార్యకర్త శ్రమ వెలకట్టలేనిదని నరేంద్రబాబు కొనియాడారు. కూటమి విజయానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.