-ప్రజలే సంఘటితమై సమాజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ విక్రమాదిత్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
సమాజంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలే సంఘటితమై, బాధ్యతాయుతంగా పనిచేసే వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో భారతీయ హిందూ పరిషద్ ఏర్పాటైనట్లు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ విక్రమాదిత్య తెలిపారు.
సమాజంలో రక్తదాతలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడటం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం, సామాన్య కుటుంబాలకు నాణ్యమైన వైద్యం భారంగా మారడం వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే భక్తుల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లేకపోవడం, మహిళలకు సంపూర్ణ భద్రత, గౌరవం కల్పించాల్సిన అవసరం, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై సమాజం దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రతిభ కలిగిన యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు సామాన్య పౌరుల సమస్యలకు అధికార వ్యవస్థ నుంచి సత్వర స్పందన వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా, ప్రజల భాగస్వామ్యంతో సమాజ హితం కోసం పనిచేసే బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడమే భారతీయ హిందూ పరిషద్ ప్రధాన ఉద్దేశమని శ్రీకాంత్ విక్రమాదిత్య వెల్లడించారు. సామాజిక సేవ, సమాన అవకాశాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలను సంఘటితం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
