-విద్యార్థినీ… జర భద్రం కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విద్యార్థినులు విద్యలో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ‘విద్యార్థినీ… జర భద్రం’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాప్తాడు వంటి ఘటనలు సమాజానికి మాయని మచ్చలని, ఇటువంటి ఘటనలకు దారితీసే చెడు ప్రభావాల నుంచి విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, అవి జరగకుండా నివారించడమే సమాజం బాధ్యతని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సమన్వయంతో కృషి చేసినప్పుడే మహిళలు, విద్యార్థినులపై జరిగే దాడులను అరికట్టగలమన్నారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థినులపై అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి, చెడుల మధ్య తేడాను గుర్తిస్తూ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘జర భద్రం’ వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని బోర్డు చైర్మన్‌ను కోరారు.
మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులతో నిర్భయంగా పంచుకోవాలని, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.
న్యాయవాది డి. సౌజన్య మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గృహహింస, బాల్యవివాహాలు, కిడ్నాప్‌లు, అపరిచితులతో పరిచయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సామాజికవేత్త గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ‘జర భద్రం’ అంటే భయపెట్టడం కాదని, జాగ్రత్తగా ఉండాలనే అవగాహన కల్పించడమేనని వివరించారు. తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పే గురువులను గౌరవిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థినులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, డి.సి.ఓ. అంగడి మురళీకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ కె. బ్యూల, జి.కొండూరు ఎస్సై సతీష్, మహిళా ఎస్సై గిరిజామణి తదితరులు పాల్గొన్నారు.
