-2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల వాటా
-100 పట్టణ స్థానిక సంస్థల్లో 94 చోట్ల పాగా… 3,941 వార్డుల్లో 3,233 కైవసం
-పల్లెల్లోనూ అదే జోరు… ఒక్క జెడ్పీ మినహా 27 జెడ్పీలు కూటమి కైవసం
-మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువతకు నాయకత్వంలో పెద్దపీట
-మరో 30 ఏళ్లకు సరిపోయేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేశాం
-స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఫలితాల విశ్లేషణలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయని, 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమి ఆదరణ మరింత పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల ఫలితాలు, వివిధ స్థాయిల్లో కూటమి సాధించిన విజయాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానం, సామాజిక ప్రాతినిధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో గణాంకాలతో సహా వివరించారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కలిపి కూటమి 58.9 శాతం ఓట్లను సాధించిందని, 2024 ఎన్నికల్లో సాధించిన 55.3 శాతం ఓట్లతో పోలిస్తే 3.6 శాతం పెరుగుదల నమోదైందని వివరించారు. అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందని వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల్లో కూటమికి 59.9 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 34.3 శాతం మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతంగా నమోదైందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా ఉందని వివరించారు. పట్టణాల్లో కూటమి, వైసీపీ ఓట్ల శాతం మధ్య 25.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పట్టణాల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు రాగా, వైసీపీకి 27.42 శాతం వచ్చాయని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్లు లభించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఓట్ల శాతాలు చూస్తేనే.. ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు కూటమిని ఏ స్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. బాగా పని చేసిన ఉద్యోగులు, అధికారుల పనితీరును బహిరంగంగానే ప్రశంసిస్తోన్న విషయాన్ని ప్రెస్మీట్లో గుర్తు చేశారు.
తిరుగులేని విజయాలు… తిరుగులేని మెజార్టీలు
రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 575 స్థానాలను కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించిందని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ కూటమి కంటే ఎక్కువ స్థానాలు సాధించిందని వివరించారు. ఏడు జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని చెప్పారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయిందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,818 స్థానాలకు గాను కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని, రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం 100 మేయర్, చైర్పర్సన్ పదవులకు గాను 94 స్థానాలను కూటమి గెలుచుకుందని, 13 మేయర్ పదవుల్లో 12, 87 చైర్పర్సన్ పదవుల్లో 82 దక్కించుకుందని తెలిపారు. ఇందులో టీడీపీ 70, జనసేన 20, బీజేపీ నాలుగు మేయర్, చైర్పర్సన్ పదవులను సాధించాయని ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం 3,941 వార్డులకు గాను 3,233 వార్డుల్లో కూటమి జయకేతనం ఎగురవేసిందని, ఇది 82 శాతమని పేర్కొన్నారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 95 చోట్ల కూటమికి కౌన్సిల్ మెజారిటీ లభించిందని, 16 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి వార్డునూ కూటమి గెలుచుకుందని చెప్పారు. మరోవైపు వైసీపీ 100 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం నాలుగు చోట్లే విజయం సాధించిందని, 3,941 వార్డుల్లో 558 స్థానాలకే పరిమితమైందని తెలిపారు. 22 పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోయిందని వివరించారు.
దశాబ్దాల తర్వాత పులివెందులలో స్వేచ్ఛగా పోలింగ్
విశాఖలో 2,47,817 ఓట్ల మెజారిటీ, విజయవాడలో 1,30,872 ఓట్లు, గుంటూరులో 96,294 ఓట్ల ఆధిక్యంతో కూటమి విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. పులివెందులలో సైతం కూటమి 13,875 ఓట్ల మెజారిటీతో చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకుందని, మొత్తం 40 వార్డుల్లో 37 గెలుచుకుందని చెప్పారు. కడప కార్పొరేషన్లో 65,588 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో పాటు 66 వార్డుల్లో 64 స్థానాలను కూటమి గెలుచుకుందని వివరించారు. కడప జిల్లాలో రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని, జిల్లాలోని తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలూ కూటమి ఖాతాలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో 345 వార్డులకు గాను వైసీపీ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. అనంతపురంలో మేయర్ పదవి దక్కకపోయినా కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమి తరఫున గెలిచారని పేర్కొన్నారు.
మహిళలకు 60 శాతం… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 62.9 శాతం ప్రాతినిధ్యం
మేయర్లు, చైర్పర్సన్ల ఎంపికలో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు, సామాజికంగా అణగారిన వర్గాలకు, మైనారిటీలకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు, చైర్పర్సన్లలో 42 మంది మహిళలేనని, అంటే 60 శాతం ప్రాతినిధ్యం కల్పించామని వివరించారు. టీడీపీ గెలిచిన పది మేయర్ పదవుల్లో ఎనిమిది స్థానాల్లో మహిళలే బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పారు. విశాఖ, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు నగరాలకు మహిళలు నాయకత్వం వహించనున్నారని తెలిపారు. టీడీపీ నుంచి ఎన్నికైన 70 మంది మేయర్లు, చైర్పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారని, మొత్తంగా ఈ వర్గాలకు 62.9 శాతం ప్రాతినిధ్యం కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీసీలకు 25 పదవులు, ఎస్సీలకు తొమ్మిది, మైనారిటీలకు తొమ్మిది, ఎస్టీలకు ఒక పదవి దక్కిందన్నారు. మొత్తం 27 సామాజిక వర్గాలకు చెందినవారు టీడీపీ తరఫున మేయర్లు, చైర్పర్సన్లుగా ఎన్నిక కావడం సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన పది మంది మేయర్లు పది విభిన్న సామాజిక వర్గాలకు చెందినవారని, వీరిలో నలుగురు బీసీలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారని తెలిపారు. మేయర్లు, చైర్పర్సన్లలో తొమ్మిది మంది ముస్లిం మైనారిటీలు ఉండగా, వారిలో ఆరుగురు మహిళలేనని సీఎం చంద్రబాబు చెప్పారు.
యువతకు అవకాశాలు… విద్యావంతులకు ప్రోత్సాహం
పట్టణ స్థానిక సంస్థల నాయకత్వంలో యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు, చైర్పర్సన్లలో 55 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగినవారని, వీరిలో 11 మంది పీజీ చదివినవారని వివరించారు. అంటే 78.6 శాతం మంది ఉన్నత విద్యావంతులేనని చెప్పారు. 31 మంది 45 ఏళ్లలోపు వారని, ఎనిమిది మంది 35 ఏళ్లలోపు వారని సీఎం తెలిపారు. పది మంది టీడీపీ మేయర్ల సగటు వయసు 39 సంవత్సరాలని పేర్కొన్నారు. రాజంపేటలో 26 ఏళ్ల డాక్టర్ దొంతం గాయత్రి, మచిలీపట్నంలో 29 ఏళ్ల షేక్ అబ్దుల్ అబీదా, విజయనగరంలో 31 ఏళ్ల అవనాపు భార్గవి, విశాఖలో 32 ఏళ్ల డాక్టర్ ముక్కా శ్రావణి మేయర్లుగా ఎన్నిక కావడం యువతకు ఇచ్చిన అవకాశాలకు నిదర్శనమన్నారు. ఒంగోలులో 27వ డివిజన్ నుంచి 24 ఏళ్ల చావలి చార్పిత కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారని చెప్పారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, అత్యంత నిరుపేదలు, రోజువారీ కూలీలు, రాజకీయ నేపథ్యం లేనివారు, సమాజంలో మంచి పేరున్నవారు ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినవారికి నాయకత్వ అవకాశాలు కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజకీయాల్లో తాము చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని, భవిష్యత్తులో మరో 30 ఏళ్ల పాటు పార్టీకి, రాష్ట్రానికి సేవలందించేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేశామని చెప్పారు. మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడమే కాకుండా, పట్టణ పాలనలోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచామని వివరించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కేవలం కూటమి విజయాన్నే కాకుండా, సామాజిక న్యాయం, కొత్త నాయకత్వ నిర్మాణం, ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన మద్దతును కూడా ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
