ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించాలి

-వచ్చే వారం ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించాలి.. గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించాలని, వచ్చే వారం ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్లలోని దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి లైసెన్స్డ్ ఇంజినీర్ల సహకారం తీసుకోవాలన్నారు.
గుంటూరును పోస్టర్ ఫ్రీ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో గోడలపై పోస్టర్లు అంటించే వారిపై భారీ జరిమానాలు విధించాలని, సెంట్రల్ డివైడర్లు, ఐలాండ్లపై బ్యానర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భవన నిర్మాణ సామగ్రిని రోడ్లపై వేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలా నిల్వ ఉంచిన నిర్మాణ సామగ్రిని సీజ్ చేసి జరిమానాలు విధించాలని సూచించారు. ప్రధాన రహదారులపై ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని క్రియాశీలం చేయాలని ఆదేశించారు.
రోడ్ల విస్తరణ, నక్షా సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, టీపీబీఓలు భవన నిర్మాణ అనుమతులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఏసీపీలు రెహ్మాన్, జకీరా, టీపీఎస్‌లు, టీపీబీఓలు పాల్గొన్నారు.