బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు!

-బుధవారానికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ రేపు అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం సాయంత్రానికి దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. ఆ తరువాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల వైపు పయనించి తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుపాన్ ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చని, మత్స్యకారులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బలమైన ఈదురుగాలులు
తుపాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుపాన్ కదలికలు, తీవ్రత, దిశలో మార్పులను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తామని వెల్లడించారు.