-ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలోని కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్, కెరీర్ వాక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రామవరప్పాడు రింగ్ సెంటర్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత పెంపొందించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ హాజరయ్యారు. చిన్నారులతో కలిసి ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి, సురక్షిత ప్రయాణం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన కుటుంబ సభ్యుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. సమాజ హితం కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్, కెరీర్ వాక్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, ఇన్స్పెక్టర్లు పవన్ కిషోర్, రమేష్, కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్, కెరీర్ వాక్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
